- ఇప్పటికే 358 మండలాల్లో కరువు ఛాయలు
- సెప్టెంబర్ చివరికి 315 మండలాల్లోనే గుర్తింపు
- రాష్ట్ర ప్రభుత్వానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రిపోర్టు
- పంట నష్టం 33 శాతం దాటితేనే కేంద్రం నుంచి సాయం
- యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ప్రభుత్వం సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని కరువు వేగంగా కమ్ముకుంటున్నది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. మరోవైపు చలికాలంలోనూ ఎండల తీవ్రత తగ్గకపోవడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిమట్టాలు పడిపోతున్నాయి. భూగర్భ జలాలూ అడుగంటుతున్నాయి. దీంతో రాబోయే మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా కరువు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
రాష్ట్రంలో మొత్తం 621 మండలాలుండగా.. నెల రోజుల కిందట 235 మండలాల్లో కనిపించిన కరువు ఛాయలు, సెప్టెంబర్ చివరి నాటికి 315 మండలాలకు విస్తరించాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 358కు చేరినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రానున్న 90 రోజుల్లో రాష్ట్రంలోని 85 శాతానికి పైగా మండలాల్లో కరువు ప్రభావం కనిపించే ప్రమాదముందని నివేదిక అంచనా వేసింది. పరిస్థితి మరింత దిగజారకముందే ప్రతి మండలానికీ సమగ్ర యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
పెరుగుతున్న కరువు మండలాలు
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. చాలా జిల్లాల్లో వర్షపాత లోటు నమోదైంది. దీంతో ప్రధాన జలాశయాలు, చెరువుల్లో నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, పత్తి, జొన్న తదితర పంటలు చాలాచోట్ల ఎండిపోయాయి. పంట నష్టంతోపాటు యాసంగి సాగుకు నీటి కొరత, తాగునీటి ఎద్దడి రైతులను, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, కేంద్రం నిబంధనల ఆధారంగా సెప్టెంబర్ చివరి నాటికి 315 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
జిల్లాలవారీగా నష్టం వివరాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రానికి సమగ్ర నివేదికలు పంపించింది. రైతులను ఆదుకునేందుకు జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరింది. అయితే, క్షేత్రస్థాయిలో కరువు ప్రభావిత మండలాల సంఖ్య ఇప్పటికే 358కు పెరిగింది. ఈ నెలాఖరుకు ఎన్ని మండలాల్లో కరువు పరిస్థితులున్నాయనే దానిపై స్పష్టత రానుంది.
కఠినంగా కేంద్రం గైడ్‌లైన్స్
కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే కరువు మండలాలను ప్రకటిస్తారు. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షపాత లోటు, వరుసగా మూడు, నాలుగు వారాలపాటు వర్షాలు కురవకపోవడం (డ్రై స్పెల్స్), ఉపగ్రహ ఆధారిత సూచీలు, నేలలో తేమ శాతం, పంట సాగు విస్తీర్ణం తగ్గుదల వంటి సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రబీ సీజన్‌లోనూ పంట నష్టం, నేలలో తేమ శాతం, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కరువు పరిస్థితులను అంచనా వేస్తారు. రాష్ట్రం నుంచి నివేదిక అందిన తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాన్ని పంపుతుంది.
ఈ టీమ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలిస్తుంది. దాని ఫైనల్ రిపోర్టు ఆధారంగా కేంద్రం కరువు పరిస్థితులపై నిర్ణయం తీసుకుని ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) విడుదల కావడానికి కేంద్రం విధించిన కఠిన నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలో పంట నష్టం కనీసం 33 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. అంతకంటే తక్కువ నష్టం నమోదైతే కేంద్రం నుంచి నిధులు అందవు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వద్ద పరిమితంగా ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులతోనే రైతులను ఆదుకోవాల్సి వస్తుంది.
